: నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో నలుగురు పోలీసులకు జీవిత ఖైదు
నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ కోర్టు నలుగురు పోలీసులకు జీవిత ఖైదు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కథనం ప్రకారం.. నవంబరు 8, 1996లో ఉత్తరప్రదేశ్‌లోని భోజ్పూర్(మండినగర్) ప్రాంతంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నలుగురు రోజువారీ కార్మికులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. వారు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లని పోలీసులు పేర్కొన్నారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం మృతదేహాలను తీసుకునేందుకు ఎవరూ రాలేదని చెబుతూ వాటిని దహనం చేశారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై స్థానికులు, బాధిత బంధువుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించారు. 20 ఏళ్లపాటు కేసు విచారణ జరిగింది. ఈనెల 20న ఘజియాబాద్ కోర్టు నిందితులైన నలుగురు పోలీసులను దోషులుగా పేర్కొంది. బుధవారం వారికి సీబీఐ జడ్జి రాజేష్ చౌదరీ జీవితకాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.