: మంత్రి గంటా ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఇండియన్ బ్యాంకు


ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల స్వాధీనం కొనసాగుతోంది. ‘ప్రత్యూష  రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం తాకట్టు పెట్టిన మరో రెండు స్థిరాస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బుధవారం బ్యాంకు అధికారులు ఓ ఇంగ్లిష్ పేపర్‌లో ఆస్తుల స్వాధీన ప్రకటన జారీ చేశారు. మంత్రి బంధువు భాస్కరరావు సోదరుల పేరిట ఉన్న  ‘ప్రత్యూష  రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్’ కోసం 2005లో విశాఖపట్టణంలోని ఇండియన్ బ్యాంకు నుంచి రూ.141.68 కోట్ల రుణం తీసుకున్నారు.

దీనిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో అది వడ్డీతో కలిపి రూ.196 కోట్లు అయింది. తీసుకున్న రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు పలుమార్లు కంపెనీకి నోటీసులు జారీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ప్రత్యూష ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌లకు చెందిన ఆస్తులతోపాటు రుణం కోసం హామీదారులుగా ఉన్న మంత్రి గంటా, కంపెనీ డైరెక్టర్లు  పరుచూరి రాజారావు, పరుచూరి వెంకయ్య ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావు, కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, నామి అమూల్యల ఆస్తులను గత డిసెంబరులోనే బ్యాంకు స్వాధీనం చేసుకుంది.  

మిగిలిన బకాయిలను చెల్లించేందుకు రెండు నెలల గడువు ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో మరోమారు ఆస్తులు స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం పెరిగిన వడ్డీతో కలిపి మొత్తం రూ.203.62 కోట్లు బకాయి పడినట్టు బుధవారం బ్యాంకు జారీ చేసిన పొజిషన్ నోటీసులో పేర్కొంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సైదాపేట తాలూకా సీషోర్ టౌన్ పరిధిలోని షోలింగనల్లూర్‌, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం మణికొండ జాగీర్‌ గ్రామాల్లో ఉన్న ఆస్తులను ఈనెల 16, 17 తేదీల్లో స్వాధీనం చేసుకున్నట్టు బ్యాంకు పేర్కొంది.

  • Loading...

More Telugu News