: పోరు కోసం ప్రచార రథం.. యాత్రకు సిద్ధమవుతున్న పన్నీర్ సెల్వం
చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు బావుటా ఎగరవేసి, అనంతర పరిణామాలతో ఒంటరైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించేందుకు ప్రచార రథాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మహీంద్ర జీపుకు చిన్నచిన్న మార్పులు చేయించి ప్రచార రథంగా తీర్చిదిద్దుతున్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్పీకరించిన పన్నీర్ సెల్వం ఆమె మరణంతో పూర్తిగా సమస్యల్లో చిక్కుకున్నారు.
పార్టీ పగ్గాలు ‘చిన్నమ్మ’ చేతికి వెళ్లడంతోనే పన్నీర్‌కు సమస్యలు మొదలయ్యాయి. సీఎం పీఠం ఎక్కేందుకు ఉత్సాహం చూపిన శశికళ.. పన్నీర్‌తో బలవంతంగా రాజీనామా చేయించారు. దీంతో కలత చెందిన ఆయన శశికళపై తిరుగుబాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలను పూర్తిగా తనవైపు తిప్పుకోవడంలో విఫలమైన పన్నీర్ చివరికి మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. ఈ క్రమంలో అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, శశికళ, ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు పన్నీర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గతంలోనే పలుమార్లు చెప్పిన ఆయన తాజాగా ఇందుకోసం ఓ ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. త్వరలోనే రథయాత్రకు సంబంధించిన తేదీలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.