: ‘పిట్ట కథల’ ట్రంప్‌పై పేలుతున్న జోకులు!


విషయం ఏదైనా ఇటువంటి ఘటనే గతంలో ఒకటి జరిగిందని, ఇదే రంగంలో మావాడొకడు ఉన్నాడని ప్రస్తావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జోకులు  పేలుతున్నాయి. ఆయన ఏవిషయం చెప్పినా దానికి  సంబంధించిన ఘటనను తనకో, తనవారికో ఆపాదిస్తూ చెప్పడాన్ని అలవాటుగా మార్చుకున్న ట్రంప్‌ను ఇప్పుడు అందరూ ‘పిట్టకథల అధ్యక్షుడు’గా పిలుస్తున్నారు. ట్రంప్‌ను బాగా దగ్గర నుంచి గమనించిన వారు ఆయన వ్యవహార శైలిపై బోలెడన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు.

గత గురువారం వివిధ విమానయాన సంస్థల సీఈవోలతో భేటీ అయినప్పుడు తన వ్యక్తిగత విమానం నడిపే పైలట్ సమస్యల గురించి ట్రంప్ ప్రస్తావించారు. అంతకుముందు వ్యాపార, ఆర్థిక రంగ నిపుణులతో జరిగిన సమావేశంలో వ్యాపారంలో తన స్నేహితులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందుల గురించి చెబుతూ ఆర్థిక నియంత్రణలను తగ్గించాల్సి ఉందని చెప్పారట. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావడాన్ని సమర్థించిన ట్రంప్ ఆ సమయంలో తన వ్యాపారికి ఈయూ బ్యూరోక్రసీ నుంచి ఎదురైన ఇబ్బందుల గురించి ప్రస్తావించారట. ఇలా ప్రతి విషయానికి ముందు ఓ కథ చెప్పే ట్రంప్‌ను ఇప్పుడు అందరూ పిట్టకథల అధ్యక్షుడని చెప్పుకుంటున్నారు.

 కథలు చెప్పడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు కానీ, ఆ ప్రభావం విధానపరమైన నిర్ణయాలపై పడితే ఇంకేమైనా ఉందా? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత అధ్యక్షులు రోనాల్డ్ రీగన్, లిండన్ జాన్సన్, బిల్ క్లింటన్ వంటి వారు విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజల ఇబ్బందులను కానీ, వ్యక్తిగతంగా తమకు తెలిసిన వివరాలను కానీ ఆధారంగా చేసుకునేవారని, కానీ ట్రంప్ వారందరినీ మించిపోయారని పెన్సిల్వేనియాకు చెందిన యూనివర్సిటీ ప్రొఫెసర్ కథలీన్ హాల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News