: భావన లైంగిక వేధింపుల క్రమం... ఎఫ్ఐఆర్ రిపోర్ట్ వివరాలు!
భారతీయ సినీ పరిశ్రమ మొత్తం దిగ్భ్రాంతికి గురైన భావన లైంగిక వేధింపుల ఘటనలో వెలుగుచూసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీవ్ర ఆందోళనకు గురిచేసేలా ఉండడానికి తోడు... సినీ పరిశ్రమలో రాజ్యమేలుతున్న అంత్యంత హేయమైన సంస్కృతిని కళ్లకు కడుతోంది. ఇక భావన ఎఫ్ఐఆర్ వివరాల్లోకి వెళ్తే... గత శుక్రవారం త్రిశూర్ కు సమీపంలోని పత్తురైక్కల్ లో షూటింగ్ ముగించుకొని భావన సినిమా యూనిట్ ఏర్పాటు చేసిన ఎస్యూవీ వాహనంలో సాయంత్రం ఏడు గంటలకు బయల్దేరింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్ లో ఉంటున్న తన స్నేహితురాలి దగ్గరకు చేరుకునేందుకు ఆమె ఆ వాహనంలో బయల్దేరింది.
ఆమె బయల్దేరేముందు...ఆ ఎస్యూవీకి డ్రైవర్ గా వ్యవహరించిన మార్టిన్ పలువురికి ఎస్ఎంఎస్ లు పంపించాడు. దీంతో రాత్రి 8:30 నిమిషాల సమయంలో ఆమె వాహనాన్ని వెంబడిస్తున్న వాహనంతో పల్సర్ సునీ గ్యాంగ్ సభ్యులు నెదుంబసరీ ఎయిర్ పోర్ట్ జంక్షన్ లో ఢీ కొట్టారు. దీంతో ప్లాన్ లో భాగంగా మార్టిన్ కారును ఆపాడు. ఆ వెంటనే ఆమె కారులోకి ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) చొరబడి ఆమె నోటిని మూసేశారు. కేకలు వేస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ బెదిరించారు. వెంటనే ఆమె నుంచి ఫోన్ ను బలవంతంగా లాక్కున్నారు.
అలాగే కారును పోనిచ్చిన తరువాత కారులో ఏ3 నిందితుడిగా పేర్కొనబడ్డ నిందితుడు కలంసెరీ వద్ద దిగాడు. అక్కడ నల్ల టీషర్ట్ ధరించిన నాలుగో నిందితుడు (ఏ4) కారులోకి ఎక్కాడు. అతను కూడా భావన నోరు మూశాడు. కొంత దూరం వెళ్లగానే అక్కడ మరో ఇద్దరు కారు ఎక్కారు. ఈ నలుగురూ కారు రూట్ మార్చి ఒక ఇంటి ముందు ఆపారు. అక్కడి నుంచి ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని అలియాస్ సునిల్ కుమార్ రంగంలోకి వచ్చాడు. ముఖానికి టవల్ కట్టుకొని వచ్చిన అతను డ్రైవర్ సీట్లోకి మారాడు.
అప్పటివరకు వాహనాన్ని నడిపిన అసలు డ్రైవర్ మార్టిన్ గ్యాంగ్ లోని మిగతా సభ్యులతో కలిసి క్యాటరింగ్ వ్యాన్ లోకి ఎక్కాడు. దీంతో డ్రైవింగ్ బాధ్యతలను పల్సర్ సుని తీసుకుని కక్కనాడ్ కు తీసుకెళ్లి భావనను లైంగికంగా వేధించాడు. అక్కడ తాను థర్డ్ పార్టీ తరపున వచ్చానని, తనకు సహకరించాలని చెబుతూ ఆమెను అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. తరువాత ఆమెను కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులోంచి బయటకు గెంటేశాడు. సుమారు రెండున్నర గంటలపాటు ఆమెపై ఈ దారుణం జరిగింది.
అక్కడి నుంచి ఆమె ప్రస్తుతం నటిస్తున్న సినిమా దర్శకుడు లాల్ ఇంటికి వెళ్లింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా తీసిన వీడియో, ఫోటోలు బయటపెట్టకుండా ఉండాలంటే 30 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో మొత్తం బయట్టబయలు చేస్తానని హెచ్చరించాడని, తాను కొరుకున్నట్టు ఉండకపోతే...కారులో కిడ్నాప్ చేసినట్టే డ్రగ్స్ ఇంజెక్ట్ చేసి మరింత వేధిస్తానని చెబుతూ, భయభ్రాంతులకు గురిచేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్ రిపోర్టు చూసిన అనంతరం కేరళ సినీ పరిశ్రమకు ఈ దారుణంలో భాగం ఉందని తెలుస్తోంది. సినీ పరిశ్రమలోనివారే వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకు కిరాయి మూకతో ఇలాంటి నీచానికి పాల్పడ్డారని, సినిమా వాళ్ల తరపున పల్సర్ సునీ ఇలాంటి దారుణాలు చేస్తాడని ఎమ్మెల్యే పీటీ థామస్ తెలిపారు.