: జయలలిత దోషిగా తేలారు, పథకాలకు ‘అమ్మ’ పేర్లు తీసేయండి: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత దోషేనని ఇటీవలే సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు పథకాల్లో అమ్మ పేరును తీసేయాలని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్ డిమాండ్ చేశారు. ఇటీవలే ఐదు కీలక ఆదేశాలపై సంతకాలు చేసిన తమిళనాడు సీఎం పళనిస్వామి పలు పథకాలు అమలు పరుస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా తమిళనాడులో మహిళలకు రాయితీపై టూ వీలర్లు ఇచ్చే పథకానికి అమ్మ టూ వీలర్ స్కీం అని పేరుపెట్టారని రాందాస్ అన్నారు. ఆ పేరు సరికాదని, ప్రభుత్వం రాజ్యాంగపరంగా నడుచుకోవాలని ఆయన సూచించారు.
అన్నాడీఎంకే నేతలకు కావాలనుకుంటే తమ పార్టీ కార్యక్రమాల్లో జయలలితకు నివాళులు అర్పించుకోవచ్చని, అంతేగానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం కాదని రాందాస్ మండిపడ్డారు. అమ్మ పేరుతో ఉన్న అన్ని పథకాల పేర్లు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పందించాలని చెప్పారు.