: ఫోన్ నంబర్ చెప్పకుండానే రీచార్జి.. అమ్మాయిలకు శుభవార్త చెప్పిన వొడాఫోన్
షాపుల్లోకి వెళ్లి మొబైల్ రీచార్జ్ చేయించుకోవాలంటే ముందుగా మన నెంబరును చెప్పవలసి ఉంటుంది. అయితే, వొడాఫోన్ సంస్థ కస్టమర్లు తమ మొబైల్ నెంబరు చెప్పక్కర్లే కుండానే రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇటీవల ఓ రీఛార్జ్ షాపులో అమ్మాయిల ఫోన్ నంబర్లను వంద రూపాయల చొప్పున అమ్మేస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డ విషయం తెలిసిందే. తన వద్ద రీఛార్జ్ చేయించుకున్న అమ్మాయిల్లో అందంగా ఉన్న అమ్మాయిల ఫోన్ నెంబర్లను ఇంకా ఎక్కువ రేటుకే అమ్మేశాడు.
ఈ నేపథ్యంలోనే రిటైలర్‌కి నంబర్ చెప్పకుండానే రీచార్జి చేసుకునే అవకాశం కల్పిస్తోంది వొడాఫోన్. ఇందుకోసం వినియోగదారులు 12604 నంబర్‌కు ‘Private’ అని మెసేజ్ పంపాలని, వెంటనే వారి మొబైల్‌కి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుందని వొడాఫోన్ ప్రతినిధులు చెప్పారు. ఆ ఓటీపీని రీటైలర్‌కి చెబితే చాలు. ఇక ఈ ఓటీపీ ద్వారానే రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఇప్పటికే ఈ సర్వీసు పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభం అయింది.