: అశ్విన్ బౌలింగ్ శైలిని పరిశీలించాను...నేర్చుకున్నాను....భారత్ నడ్డి విరుస్తానంటున్న లియాన్
టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ పరిశీలించానని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ తెలిపాడు. స్పిన్ బౌలింగ్ ను ఆడడం, స్పిన్ బౌలింగ్ తో భారత్ కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జట్టును ఎంపిక చేసుకున్న ఆస్ట్రేలియా భారత గడ్డపై ఐదుగురు స్పిన్నర్లతో అడుగుపెట్టింది. ఆసీస్ స్టార్ బౌలర్ నాథన్ లియాన్, జూనియర్లు స్టీవ్ ఒకీఫె, అస్టన్ అగర్, ఇంకా ఒక్క అంతర్జాతీయ మ్యాచైనా ఆడని స్వీప్సన్ తోపాటు అవసరాన్ని బట్టి బౌలింగ్ చేసే మ్యాక్స్ వెల్ ఆసీస్ జట్టులో స్థానం కల్పించారు.
ఈ నేపథ్యంలో స్టార్ స్పిన్నర్ నాధన్ లియాన్ మాట్లాడుతూ, టీమిండియా టాప్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ చేసే విధానాన్ని పరిశీలించానని తెలిపాడు. అతను అగ్రశ్రేణి బౌలర్ అని తెలిపాడు. అతని బౌలింగ్ శైలి నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పాడు. భారత్ తో సిరీస్ సందర్భంగా భారత్ పై అతని నుంచి నేర్చుకున్న మెళకువలను ప్రదర్శిస్తానని తెలిపాడు. కాగా, నాధన్ లియాన్ అద్భుతమైన బౌలర్ అంటూ ఆసీస్ కోచ్ లీమన్ చెబుతున్న సంగతి తెలిసిందే.