: రేపే తొలి టెస్టు... సీరియస్ గా ప్రాక్టీసు చేసిన రెండు జట్లు!
ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య టెస్టు సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. పూణే వేదికగా జరగనున్న తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభం కానుండగా, సిరీస్ లో విజయం సాధించాలని రెండు జట్లు పట్టుదలతో వున్నాయి. భారత్ లో భారత్ పై గత రెండు సిరీస్ లలో క్లీన్ స్వీప్ కు గురై తీవ్రమైన అవమానభారంతో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు ఈ సిరిస్ ను ఎలాగైనా విజయాలతో ముగించాలని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత్ స్పిన్ బౌలింగ్ ను ఆడుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆసీస్ జట్టు తీవ్రమైన ప్రాక్టీస్ చేసింది. ఇందుకు స్థానిక బౌలర్ల సాయం కూడా తీసుకుంది. మరోవైపు తమ ఆటగాళ్ల బౌలింగ్ నైపుణ్యాలను అంచనా వేస్తూ ప్రాక్టీస్ ను రక్తికట్టించింది. దీంతో భారత్ 'ఏ'తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. భారత జట్టుపై కూడా అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా షాకివ్వాలని ఆసీస్ ఆటగాళ్లు భావిస్తున్నారు.
మరోవైపు భారత ఆటగాళ్లు పాత రికార్డును చెరిగిపోకుండా చూడాలని భావిస్తున్నారు. ఆసీస్ ను మరోసారి క్లీన్ స్వీప్ చేసి ముచ్చటగా మూడోసారి భారత్ లో భారత్ పై క్లీన్ స్వీప్ అయిన జట్టుగా రికార్డు పుటలకు ఆస్ట్రేలియాను ఎక్కించాలని భావిస్తున్నారు. దీంతో అద్భుతమైన ఫాంలో ఉన్న ఆటగాళ్లను మాత్రమే జట్టులోకి తీసుకున్నారు. ట్రిపుల్ సెంచరీతో సత్తాచాటిన కరణ్ నాయర్ వంటి ఆటగాడికి కూడా తుది జట్టులో స్థానం లభించలేదంటే భారత జట్టులో యువ ఆటగాళ్ల మధ్య ఏ రకమైన పోటీ నెలకొందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో రెండు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. దీంతో అభిమానులకు పసందైన క్రికెట్ విందు లభించనుంది.