: ఓయూలో శతాబ్ది ఉత్సవాల కమాన్‌ను దహనం చేసిన విద్యార్థులు.. భారీగా చేరుకున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో ఈ రోజు నిరుద్యోగుల నిరసన ర్యాలీ నిర్వహించాల్సిందిగా టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఓయూలో ఇప్పటికే పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన విద్యార్థులు, ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవాల కమాన్‌ను దహనం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ఠాగూర్ ఆడిటోరియం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. మరోవైపు నగరంలోని పలుచోట్ల అరెస్టుల పర్వం కొనసాగుతోంది.