: కంటతడి పెట్టిన ఉబెర్ సీఈవో
ప్రముఖ ఆన్ లైన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీ ఉబెర్ సీఈవో ట్రావిస్ కాలనిక్ కంటతడి పెట్టారు. కంపెనీ మహిళా ఉద్యోగులతో నిర్వహించిన ఓ సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఉబెర్ లో మహిళా సిబ్బంది ఏ విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారో వెల్లడిస్తూ, ఓ మహిళా ఉద్యోగి తీవ్ర ఆరోపణలు చేయడంతో... ఆయన కంపెనీ అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ప్రస్తావించిన సమస్యలు విని ఆయన కంటతడి పెట్టుకున్నారు. అంతేకాదు తాను ఏయే విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందీ కూడా చెప్పి, నిజాయతీగా వాటిని ఒప్పుకున్నారు. ఇకపై కంపెనీలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దాదాపు గంటన్నర పాటు మహిళా సమస్యలపై మహిళా ఉద్యోగులతో ఆయన చర్చించారు.