: నిరాహారదీక్షలతో అట్టుడుకుతున్న తమిళనాడు... తిరుచ్చిలో స్టాలిన్
ముఖ్యమంత్రి పళనిస్వామి బల పరీక్ష సందర్భంగా తమిళనాడు అసెంబ్లీలో పోలీసు బలగాలు మోహరించడాన్ని నిరసిస్తూ... ఆ రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే నిరాహారదీక్షలు చేపట్టింది. తమిళనాడు వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తిరుచ్చిలో ఈ దీక్షలో పాల్గొన్నారు. బల పరీక్ష సమయంలో ప్రజాస్వామ్య విలువలకు స్పీకర్ ధనపాల్ తిలోదకాలిచ్చారని, సభను అపహాస్యం చేశారని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు, ఇదే విషయంపై స్పీకర్ పై అసెంబ్లీ కార్యదర్శికి డీఎంకే ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. బల పరీక్షను మరోసారి నిర్వహించాలని డీఎంకే నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, డీఎంకే చేపట్టిన నిరాహార దీక్షలపై అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. చట్ట ప్రకారమే బల నిరూపణ జరిగిందని... కావాలనే డీఎంకే రాద్ధాంతం చేస్తోందని విమర్శిస్తున్నారు.