: తిరుమలలో స్పృహ తప్పి పడిపోయిన మంత్రి పోచారం
తెలంగాణ సీఎం కేసీఆర్ తో తిరుమల పర్యటనకు వెళ్లిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం ఆయన మణి మంజరి అతిథి గృహానికి చేరుకున్నారు. అయితే, ఆ అతిథి గృహంలో కేసీఆర్ ఉండటంతో ఆయన్ని కలిసేందుకు వెళ్తున్న సమయంలో పోచారం స్పృహ తప్పి పడిపోయినట్లు సమాచారం. దీంతో, వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది స్థానిక అశ్విని ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. లో బీపీ కారణంగానే ఆయన అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఆసుపత్రి వద్దకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.