: మద్యం తాగి వాహనాలు నడిపితే ‘స్టిక్కర్లు’ తప్పవు!
హైదరాబాదు నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వాహన చోదకులకు ఇకపై గడ్డు కాలమే. ఎందుకంటే, మద్యం తాగి పట్టుబడ్డ వారి వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు ‘స్టిక్కర్లు’ అతికించనున్నారు. ‘తాగి వాహనాలు నడపరాదు’ అనే స్లోగన్ తో కూడిన స్టిక్కర్లను అతికించడం ద్వారా వాహనచోదకులకు అవగాహన కల్పిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ దివ్యచరణ్ రావు పేర్కొన్నారు. ఈ స్టిక్కర్లపై వాట్సప్ నెంబర్ 9490617111, డయల్ 100 నెంబర్ తో పాటు ఇతర వివరాలు ఉంటాయన్నారు.
ఈ నంబర్ల ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 1,215 మంది మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడగా, వారిలో విద్యార్థులు16 మంది, ప్రభుత్వ ఉద్యోగులు 14 మంది, ప్రైవేట్ ఉద్యోగులు 10 మంది ఉన్నారన్నారు. పట్టుబడ్డ వారిలో 243 మంది జైలు శిక్ష అనుభవించారని, లైసెన్స్ లేని వాహన చోదకులకు, మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చామని దివ్యచరణ్ రావు పేర్కొన్నారు.