: మంత్రివర్గంలో చేరడానికి ముందే చట్టసభకు లోకేశ్.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ చాన్స్!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరో నెల రోజుల్లోనే చట్టసభలో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేయడంతో లోకేశ్‌ను ఎమ్మెల్సీగా పంపాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబునాయుడు ఇప్పటికే నిర్ణయించారు. అయితే మంత్రి కావాలంటే రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో ఏదో ఒక దానిలో సభ్యుడై ఉండాలి. ప్రస్తుతం శాసనసభలో ఖాళీ లేకపోవడంతో ఎమ్మెల్సీగా చేసి అటునుంచి మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన ప్రతిభాభారతి, సి.రామచంద్రయ్య, చెంగల్రాయుడు, సుధాకర్‌బాబు, సతీశ్‌రెడ్డి, పీజే చంద్రశేఖర్, మహ్మద్ జానీలు వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. వారి స్థానాల్లో కొత్తగా ఏడుగురిని ఎన్నుకోవాల్సి ఉంది. మార్చి 20 నాటికి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తికావాల్సి ఉండడంతో నెల రోజుల్లోనే లోకేశ్ చట్టసభలో అడుగుపెట్టనున్నారు.