: కేసీఆర్‌తో పాటు నాపై 70 కేసుల వరకు ఉన్నాయి.. ఆయన ఏ1, నేను ఏ2: ప్రొ. కోదండరాం
తమపై నేరపూరిత కేసులు ఉన్నాయని, హింసకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెప్పారని ప్రొ.కోదండరాం ఈ రోజు మీడియాతో ప్రస్తావిస్తూ.. అలా అయితే, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో కేసీఆర్‌తో పాటు తనపై 70 కేసుల వరకు ఉన్నాయని, వాటిలో కేసీఆర్ ఏ1, తాను ఏ2గా ఉన్నామని చెప్పారు. కొన్ని కేసుల్లో తాను ఏ1 గా ఉంటే, కేసీఆర్ ఏ2 గా ఉన్నారని ఆయన అన్నారు.
సాగరహారం, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్ వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నామని, వాటిల్లో పాల్గొన్నందుకే ఇప్పుడు తమను నేరగాళ్లు అంటున్నారని కోదండరాం తెలిపారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఓ ప్లానింగ్ లేకుండా ముందుకు వెళుతోందని ఆయన అన్నారు. తాను ఓ ప్రణాళిక ప్రకటించాలని అడిగానని, కాంట్రాక్టు ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వాలని అడిగానని చెప్పారు. తాము ర్యాలీ చేస్తామని ప్రకటన చేసినప్పటి నుంచి తమ వెనుక పోలీసులే పడుతున్నారు తప్పా ప్రభుత్వం వచ్చి చర్చలు జరపడం లేదని అన్నారు.