: జయలలిత జయంతిని పెద్ద ఎత్తున్న నిర్వహించాలన్న చిన్నమ్మ!
ఈ నెల 24న దివంగత జయలలిత జయంతి. ఈ సందర్భంగా ఆమె జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఈ మేరకు తమ పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ రాశారు. జయలలిత జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పార్టీని వెన్నుపోటు పొడవాలనుకున్న వారి ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్నామని, వారి కుట్రలను సాగనివ్వలేదని అన్నారు. ఎంజీఆర్ శత జయంతి సంవత్సరంలో జయలలిత పాలనను కాపాడుకున్నామని శశికళ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, తన అక్క కొడుకు అయిన దినకరన్ జైల్లో ఉన్న శశికళను కలిశారు. ఆ తర్వాత శశికళ లేఖ రాయడం గమనార్హం.