: రేపు వేల మందిని అరెస్టు చేయవచ్చు... ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడే దీక్షకు దిగండి: కోదండరాం పిలుపు
గతంలో ఢిల్లీలోని రాంలీల మైదానంలో అన్నాహజారే తలపెట్టిన జన్ లోక్‌పాల్ బిల్లు నిరసన ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి సానుకూలంగా తీర్పు వచ్చిందని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడం ప్రజల హక్కని తెలిపిందని, శాంతిభద్రతల బాధ్యత పోలీసులే చూసుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు. ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... శాంతియుతంగా నిరసన చేసుకోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కని ఆయన తెలిపారు.
ఆనాడు ఢిల్లీలో అన్నాహజారేకు చెప్పిన మాటలే ఈ రోజు తమకు ఇక్కడి పోలీసులు చెబుతున్నారని, శాంతిభద్రతల సమస్య అంటున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎంతో మందిని అరెస్టు చేశారని, ఎక్కడ అరెస్టు చేస్తే అక్కడ శాంతియుత దీక్షకు దిగాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే 600 మందిని అరెస్టు చేశారని తమ వద్ద సమాచారం ఉందని, రేపు వేల సంఖ్యలో అరెస్టులు జరగవచ్చని, అయినప్పటికీ దీక్షను కొనసాగించాలని ఆయన సందేశమిచ్చారు. ర్యాలీకి హైకోర్టు నుంచి ఈ రోజు పర్మిషన్ వచ్చిందని, అయితే హైకోర్టు తీర్పు ఇవ్వకముందే నిన్ననే ఎందుకు అరెస్టులు చేశారని ఆయన ప్రశ్నించారు.