: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వీరంతా తీవ్ర‌వాదులా.. సిగ్గుచేటు!: కోదండ‌రాం తీవ్ర ఆగ్రహం


హైదరాబాద్‌లో రేప‌టి నిరుద్యోగ నిరసన ర్యాలీకి ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాని నేప‌థ్యంలో టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం తెలంగాణ‌ స‌ర్కారుపై ఎన్న‌డూ లేని విధంగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారంద‌రి వెనుక నేరపూరిత చ‌రిత్ర ఉంద‌ని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో చేసిన పోరాటాలు, మిలియ‌న్ మార్చ్ వంటివే మాపై ఉన్న నేరాలు. సిగ్గు చేటు.. రాష్ట్ర పోరాటంలో పాల్గొన్న వారిని తీవ్రవాదులు అంటారా?.. ఆనాడు స‌మైక్యాంధ్ర పాల‌కులు కూడా ఇటువంటి కారణాలే చూపుతూ పోరాటాలను అడ్డుకోవాలని చూశారు. ఆ ఉద్యమంలో పాల్గొనడమే నేరమయితే ఆ నేరంలో కొంత భాగం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా ఉంది కదా?' అని కోదంరాం ప్రశ్నించారు.

'ర్యాలీని మియాపూర్‌, శంషాబాద్‌, నాగోల్ వంటి ప‌లు ప్రాంతాల్లో నిర్వ‌హించుకోవా‌లంటున్నారు. ఈ నిర‌స‌నను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయ‌డానికి చేస్తున్నాం... హైద‌రాబాద్ న‌డిబొడ్డులోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌, ఎన్టీఆర్ పార్క్‌, న‌క్లెస్ రోడ్ వంటి ప్రాంతాల్లోన‌యినా అనుమతి ఇవ్వ‌మ‌న్నాం. నిజాం గ్రౌండ్స్ ఇస్తామ‌ని ఆ కాలేజీ పెద్దలు చెప్పారు. కానీ పోలీసుల ఒత్తిడితో మ‌ళ్లీ ఇవ్వ‌బోమ‌ని చెప్పారు. అనుమతి ఇవ్వకపోవడానికి ఎన్నో కార‌ణాలు చెబుతున్నారు' అని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News