: రజనీకాంత్ ను స్ఫూర్తిగా తీసుకుని ఎదిగాను: నటుడు భానుచందర్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను స్ఫూర్తిగా తీసుకుని సినీ రంగంలో తాను ఎదిగానని ప్రముఖ నటుడు భానుచందర్ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మా అమ్మకు నన్ను సినీ నటుడిగా చూడాలనే కోరిక ఉండేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లా నన్ను వెండి తెరపై చూడాలని ఆమె అనుకునేది. మా అమ్మ ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చాను. చెన్నైలో యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నాను. ప్రముఖ దర్శకుడు బాలచందర్ గారు 1977లో ‘నాలాగా ఎందరో’ సినిమా తీశారు. ఆ చిత్రం ద్వారా నా సినీ రంగ ప్రవేశం జరిగింది.
ఆ తర్వాత ‘మనవూరి పాండవులు’ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ‘తరంగిణి’ సినిమా నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. నేను నటించిన సినిమాల్లో తరంగిణి, అశ్విని, సూత్రధారులు... వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి. నాటి సినిమాలకు, నేటి సినిమాలకు మధ్య ఉన్న తేడా ఏంటంటే.. అప్పట్లో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. దీంతో, ఇప్పటి సినిమాల్లో నటులకు శారీరక శ్రమ చాలా వరకు తగ్గింది. నా కుమారుడు జయంత్ సినీ రంగ ప్రవేశం త్వరలోనే జరగనుంది. ‘మిక్చర్ పొట్లాం’ అనే సినిమా ద్వారా మా అబ్బాయి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో నేను కూడా నటిస్తున్నాను’ అని భానుచందర్ చెప్పుకొచ్చారు.