: ఆ యువ‌తి ఇప్పటికి 34 సార్లు పాము కాటుకి గుర‌యింద‌ట‌!


ఓ 18 ఏళ్ల యువ‌తి గత మూడేళ్లలో 34 సార్లు పాము కాటుకు గురైన ఘ‌ట‌న‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని శ్రీమౌర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. మనీషా అనే యువ‌తి తాజాగా 34వ సారి పాము కాటుకు గుర‌వ‌డంతో బెడ్ రెస్ట్ తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ఆమె తండ్రి మీడియాతో మాట్లాడుతూ... త‌న కూతురు పాము కాటుకు గురికావడం సాధార‌ణ‌ విషయమేనని వ్యాఖ్యానించారు. అది త‌న కూతురికి అలవాటైపోయిందని అన్నారు.

మూడేళ్లుగా తనను సుమారు 30 పాములు కాటు వేశాయని, మొత్తం 34 సార్లు పాము కాటుకు గుర‌య్యాన‌ని మ‌నీషా చెప్పింది. మూడేళ్ల క్రితం త‌న‌ను నది దగ్గర మొద‌టిసారి ఓ పాము కాటేసిందని, తాజాగా ఓ తెల్లని పాము కాటేసిందని చెప్పింది. త‌న‌కు పాము కనిపించినప్పుడు ఒక విధమైన తన్మయత్వం కలుగుతుందని, అందులోంచి తాను తేరుకునేలోపే అవి త‌న‌ను కాటేస్తాయ‌ని తెలిపింది. తాను పాఠశాలలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు పాములు కరిచాయని, ఒకే రోజు రెండు, మూడు పాములు కాటుల‌కు గుర‌యి సంద‌ర్భాలు కూడా ఉన్నాయ‌ని చెప్పింది. దీంతో త‌న‌కి, ఆ దేవుడికీ ఏదో అనుబంధం ఉందని పెద్ద‌లు అంటుంటార‌ని మనీషా పేర్కొంది.

ఈ ఘ‌ట‌న‌ల‌పై వైద్యులు మాట్లాడుతూ, ఆమెను క‌రిచిన పాములు విషపూరితమైనవి కాకపోవచ్చని చెప్పారు. ఈ నెల 18న ఆమె 34వ సారి పాము కాటుకు గురైంద‌ని ప‌లు రిపోర్టుల ఆధారంగా చెప్పారు. ప్ర‌స్తుతం ఆమె వై.ఎస్‌. పార్మార్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో కోలుకుంటోంద‌ని అన్నారు. త‌న కూతురిని చాలా ఆలయాలకు, జ్యోతిష్యుల దగ్గరకు తీసుకెళ్తుంటానని మ‌నీషా తండ్రి చెప్పారు. స్థానిక దేవతల ఆశీస్సులుంటే ఏ ప్రమాదం ఉండదని త‌మ విశ్వాస‌మ‌ని పేర్కొన్నారు. మనీషా శరీరంలో యాంటీ బాక్టీరియా లక్షణాలు పెరిగాయని వైద్యులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News