: ఏటీఎం నుంచి డ్రా చేసిన రెండు వేల నోటుపై రాతలు.. చెల్లక అవస్థలు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరంలోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి 4,000 రూపాయలు డ్రా చేసుకున్న దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి విచిత్ర అనుభవం ఎదురైంది. ఏటీఎంలో వచ్చిన ఓ నోటుపై రాతలుండడంతో దాన్ని చెల్లుబాటు చేసుకోలేకపోయాడు. ఆ నోటుపై పెన్సిల్‌తో రాసి ఉందని, వెంటనే దాన్ని అక్కడి సీసీ కెమెరాకు కనిపించేలా చూపించానని దుర్గాప్రసాద్ చెప్పాడు. సాయంత్రం పూట మార్కెట్లో సరుకులు తీసుకొని ఆ నోటును మార్చుకునేందుకు ప్రయత్నించగా దానిపై రాతలు ఉండడంతో దాన్ని ఎవరూ తీసుకోలేదని వాపోయాడు. తాను పూలపల్లిలోని ఎస్‌బీఐకు వెళ్లి ఆ నోటును చూపించగా వారు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి నోటు మారుస్తామని తెలిపినట్లు దుర్గా ప్రసాద్ తెలిపాడు.
కొత్త నోట్లపై ఎటువంటి రాతలు ఉండరాదని, అలా ఉంటే ఆ నోట్లు చెల్లబోవని ఆర్‌బీఐ నుంచి ప్రకటన వచ్చిందని అందరూ భావించడంతో అటువంటి నోట్లను తీసుకునేందుకు వ్యాపారులు వెనకాడుతున్నారు.