: విమానంలో సాంకేతిక లోపం.. చివరికి రేణిగుంటలో సురక్షితంగా ల్యాండింగ్!
తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం టెన్షన్ క్రియేట్ చేసింది. సరిగ్గా ల్యాండ్ అయ్యే సమయంలో మళ్లీ గాల్లోకి ఎగిరింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో మళ్లీ పైకి లేచింది. దీంతో, విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మరో 20 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి, ఆ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో కేసీఆర్ బంధువులు, అధికారులు ఉండటంతో కలకలం రేగింది. ఘటనపై విమానాశ్రయ అధికారులు ఆరా తీస్తున్నారు.
తిరుమల వెంకన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు కేసీఆర్ తిరుమల వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బయల్దేరుతున్నారు. అంతకు ముందే ఆయన కుటుంబ సభ్యులు ఎయిరిండియా విమానంలో తిరుపతి చేరుకున్నారు.