: పోలీసులపై దాడి చేసిన రాజస్థాన్ ఎమ్మెల్యే భర్త.. ఎదురు ఫిర్యాదు చేసిన మహిళా ఎమ్మెల్యే!
ఓ మహిళా ఎమ్మెల్యే భర్త రెచ్చిపోయి పోలీసులపై దాడి చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసును చెంపదెబ్బ కొట్టడంతో పాటు తన అనుచరులతో కలిసి అక్కడున్న పోలీసులపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళితే, ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చంద్రకాంత మేఘ్వాల్ భర్త నరేంద్ర మేఘ్వాల్‌తో పాటు అతడి అనుచరులు తొలుత పోలీసులతో గొడవ పెట్టుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లోకి తమ కార్యకర్తలతో గుంపుగా వచ్చిన నరేంద్ర.. తమకు జారీ చేసిన ట్రాఫిక్ ఫైన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర అక్కడి పోలీసు అధికారిని కొట్టాడు. దీంతో అక్కడి పోలీసులంతా ఆగ్రహం తెచ్చుకొని కార్యకర్తలపై లాఠీలు ఝళిపించారు. సదరు కార్యకర్తలు కూడా రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మాట్లాడుతూ... పోలీసుపై చేయిచేసుకున్న నరేంద్రతో పాటు ఆరుగురు బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశామని చెప్పారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే చంద్రకాంత మాట్లాడుతూ... తమ మీద, తమ కార్యకర్తల మీద పోలీసులే దాడి చేశారని అన్నారు. అంతేగాక, తమను పోలీసులు నిర్బంధించారని అంటున్నారు. ఈ దాడిలో తన గాజులు పగిలిపోయాయని, చీర చిరిగిపోయిందని పేర్కొంటూ ఫిర్యాదు కూడా ఇచ్చారు. రాజస్థాన్ మంత్రి రాజేంద్ర రాథోడ్ ఈ ఘటనపై స్పందిస్తూ ఈ ఘటనపై విచారణ జరుగుతోందని, తాము ఈ విషయాన్ని సీఎం వసుంధర రాజే దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.