: ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో ఫిరంగులను మోహరించిన పాకిస్థాన్
గత వారం జరిగిన ఉగ్రదాడుల్లో పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాల్లో 100 మందికి పైగా సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, ఉగ్రవాదులపై దాడిని పాక్ సైన్యం ఉద్ధృతం చేసింది. ఈ క్రమంలో, 130 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. అంతేకాదు, 350 మందికి పైగా అదుపులోకి తీసుకుంది. వీరిలో, ఎక్కువ మంది ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన వారు ఉండటంతో... ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద భద్రతను పెంచింది.
అలాగే, దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థ దాని కార్యకలాపాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచే కొనసాగిస్తోందని పాక్ చెబుతోంది. ఈ నేపథ్యంలో, సరిహద్దులోని చమన్, తొర్కామ్ జిల్లాల సరిహద్దులో భారీ సంఖ్యలో ఫిరంగులను, సైన్యాన్ని మోహరించింది. పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.