: సినీ నటి భావనకు ఊహించని మహిళ నుంచి మద్దతు!
కేరళలోని ఎర్నాకుళంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సినీ నటి భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన సంగతి విదితమే. బహుభాషా నటి భావనకు శాండల్ వుడ్ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది. నిందితులను కాల్చి చంపాలని కిచ్చా సుదీప్ డిమాండ్ చేశాడు. నిందితులు భయపడేలా శిక్షలు ఉంటేకానీ వారిలాంటి దారుణాలకు తెగబడరని అన్నాడు. భావనకు మద్దతుగా తామంతా నిలుస్తామని చెప్పాడు.
అలాగే భావనకు ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది. గతంలో భావన రోమియో సినిమాలో నటించిన గోల్డెన్ స్టార్ గణేష్ భార్య శిల్ప భావనకు మద్దతు పలికింది. భద్రత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీ నటికే ఇలాంటి అవమానం జరిగిందంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరింది. త్వరలో తాను కేరళ వెళ్లి భావనను కలుస్తానని తెలిపింది. కాగా, గణేష్ తో భావన ప్రేమాయణం నడిపిందని, వారిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారని, శిల్ప అనూహ్యంగా అతనిని వివాహం చేసుకోవడంతో భావన ఒత్తిడి (డిప్రెషన్) కి గురైందని గతంలో వార్తలు వచ్చాయి.