: హీరోయిజాన్ని హైలైట్ చేసినంత కాలం.. హీరోయిన్ల పరిస్థితి ఇంతే!: ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్
సీనీ నటి భావనపై అత్యాచార ఘటన నేపథ్యంలో, సినీ పరిశ్రమ పోకడలపై ప్రముఖ మలయాళ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మండిపడ్డారు. పితృస్వామ్యాన్ని నెత్తికెక్కించుకుని, హీరోయిజాన్ని హైలైట్ చేసినంత కాలం పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా నటులకు నిజమైన మద్దతు దొరకదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 99 శాతం సినిమాల్లో హీరోయిజాన్నే చూపిస్తున్నారని ఆయన అన్నారు.
ఫ్యామిలీ డ్రామాలు, కాలేజీ సినిమాల్లో సైతం పురుషాధిక్యాన్నే చూపిస్తున్నారని తెలిపారు. ఈ సినిమాల్లో మహిళల వ్యతిరేక భావజాలం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి పోకడలు కొనసాగినంత కాలం నటికి అన్యాయమే జరుగుతుంటుందని తెలిపారు. ఇప్పటికైనా హీరోలు తమ డాంబికాలను తగ్గించుకోవాలని సూచించారు. సెక్సీ దుర్గ, ఒళివుడివసథె కాలి వంటి వైవిధ్యభరితమైన చిత్రాలను సనల్ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాల్లో పితృస్వామ్య పోకడలను ఆయన ప్రశ్నించారు.