: చంద్రబాబుగారూ! నా ట్రాక్ రికార్డు ఏంటి... వైస్రాయ్ హోటల్ లో కుట్రలు చేశానా?... ఇంటికి పిల్చి ఎవరినైనా కాల్చేశానా?: రోజా


శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆహ్వానం పంపి అవమానించారని సినీ నటి, ఎమ్మెల్యే రోజా మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకుని తనపై వేధింపులకు దిగారని అన్నారు. నేషనల్ ఉమెన్ పార్లమెంటు అంటే కోడెల కుమార్తె, చంద్రబాబు కోడలు, కేసీఆర్ కుమార్తెలకే మహిళా సాధికారత కావాలా? ఇతరులు మహిళలు కాదా? అని ఆమె ప్రశ్నించారు. రెండు సార్లు ఆహ్వానం పంపిన స్పీకర్ కోడెల తనను అడ్డుకోవడంపై ఎందుకు నోరు విప్పలేదని ఆమె నిలదీశారు. ఉమెన్ పార్లమెంట్ అంటే భజనపరుల సమావేశమా? అని ఆమె అడిగారు. ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో డీజీపీ నడుస్తున్నారని ఆమె ఆరోపించారు.

దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ, తన ట్రాక్ రికార్డు పరిశీలించిన మీదటే ఆమెను అడ్డుకున్నామని చెబుతున్నారని.... తన ట్రాక్ రికార్డు ఏంటో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీలో ఉన్న పదేళ్లలో తాను ఎలాంటి రౌడీయిజం చేశానో... లేదా, తనతో ఆయన ఎంత రౌడీయిజం చేయించారో చెప్పాలని ఆమె అడిగారు. లేదంటే తాను ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్ కు తీసుకెళ్లి దాచి, సొంత మామను అధికారం నుంచి దించానా? లేకపోతే తన నివాసానికి ఎవరినైనా పిలిచి, వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డానా? అదీ కాకుండా మహిళలపై రావెలలా వేధింపులకు దిగుతున్నానా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. తన ట్రాక్ రికార్డు ఏంటో ఆయన చెప్పాలని ఆమె నిలదీశారు. 

  • Loading...

More Telugu News