: ధోనీనే అవమానిస్తారా?.. టీమిండియా మాజీ కెప్టెన్ అజర్ మండిపాటు
రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ టీం సారథ్య బాధ్యతల నుంచి ధోనీని తప్పించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్రంగా మండిపడ్డాడు. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన ధోనీని పుణె యాజమాన్యం ఘోరంగా అవమానించిందని విమర్శించాడు. ధోనీ భారత్‌కు దొరికిన మేలిమి బంగారమని, అతడు సాధించిన విజయాలు అనితర సాధ్యమని ప్రశంసించాడు. గత 8-9 ఏళ్లలో సారథిగా ధోనీ అపూర్వ విజయాలు సాధించాడన్నాడు. ఫ్రాంచైజీ తన సొంత డబ్బుతో జట్టును నడిపిస్తున్నా మహీలాంటి వ్యక్తి విషయంలో ఓసారి ఆలోచించి ఉండాల్సిందన్నాడు. నిర్ణయం తీసుకోవడంలో మహీ ఖ్యాతిని దృష్టిలో పెట్టుకుని ఉండే బాగుండేదన్నారు. యాజమాన్యం తీరు ఓ క్రికెటర్‌గా తనకు కోపం తెప్పించిందని అజార్ పేర్కొన్నాడు.