: యూపీ ప్రజలు 'అఖిలేష్-రాహుల్' పొత్తుకు ఓటేస్తున్నారా?


ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ తో అఖిలేష్ యాదవ్ పొత్తు కడతానన్న వేళ అందరూ ఈ పొత్తును అపహాస్యం చేసినవారే! సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ పొత్తును పలు సందర్భాల్లో ఎద్దేవా చేశారు. అయితే, దీనిపై అఖిలేష్ వ్యూహాత్మకంగా మోదీని అనుకరిస్తూ పలు విమర్శలు చేశారు. రాహుల్ మాత్రం ఎప్పట్లా తన ప్రచారం చేసుకుపోయారు.

ఈ క్రమంలో వీరిద్దరి బంధానికి ఉత్తరప్రదేశ్ ప్రజలు పట్టం కట్టనున్నారంటూ యూపీలో మీడియా కథనాలు వస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన పోలింగ్ సరళిని గమనించిన మీడియా సంస్థలు అఖిలేష్-రాహుల్ పొత్తు పట్ల విశ్వాసంతో ఉన్నారని పేర్కొంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో వీరిద్దరి పొత్తుకే అధికారం రానుందని అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో యూపీలో కాంగ్రెస్ కు ఉన్న వాస్తవ బలం కన్నా, అఖిలేష్ 40 నుంచి 50 సీట్లు అదనంగా కేటాయించారని పేర్కొంటున్నాయి. దాంతో, 105 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.

యూపీలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధానంగా మోదీ చరిష్మాపైనే ఆధారపడింది. ముస్లింలు మినహా ఇతర వర్గాలను మోదీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ మీడియా విశ్లేషణలు పేర్కొంటున్నాయి. మోదీ ఛరిష్మా యూపీలో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇంత వరకు ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో సీఎం అఖిలేష్ యాదవ్ కు చెందిన సామాజిక వర్గం ప్రజలు పెద్దఎత్తున ఉండడంతో వారు అఖిలేష్ కు మద్దతు పలికే అవకాశాలే అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీఎస్పీకి అత్యధిక అవకాశాలు ఉన్నాయని ఎన్నికల ప్రచారం మొదలవడానికి ముందు వచ్చిన విశ్లేషణలన్నీ ఆ తర్వాత తేలిపోయాయి. మూడో స్థానంలోకి ఆ పార్టీ దిగజారిపోయిందని తెలుస్తోంది. బెహన్ జీ మాయావతి చేసిన హామీలు, వివిధ వర్గాలు, కులాలను ఆకట్టుకోలేకపోయాయని ఈ విశ్లేషణలు చెబుతున్నాయి. దీంతో మరోసారి అఖిలేష్ సర్కారు యూపీలో అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోందని తెలిపాయి.

  • Loading...

More Telugu News