: రేణిగుంట పరిసరాల్లో ఏర్పాటు చేసిన కేసీఆర్ ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు... నిరసన వ్యక్తం చేసిన అభిమానులు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీవారి తిరుమల దర్శనార్థం తిరుపతి వెళ్లనున్న నేపథ్యంలో రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుమలకు చేరుకోనున్న ప్రధాన రహదారిలో తమిళనాడు తెలుగు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి భారీ ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని చెబుతూ తిరుపతి మున్సిపాలిటీ అధికారులు వాటిని తొలగించారు. కేసీఆర్ గౌరవార్థం ఆయనను స్తుతిస్తూ ఏర్పాటు చేసిన గోడపత్రికలను మాత్రం అలాగే ఉంచేశారు. దీనిపై కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకుని ఎమ్మార్వోను ప్రశ్నించారు. అనంతరం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి మనమిచ్చే అతిధి మర్యాద ఇదా? అని ఆయన ప్రశ్నించారు.