: కేరళలో రాష్ట్రపతి పాలన విధించాలి: మేనకా గాంధీ డిమాండ్
కేరళలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. సినీ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల ఘటనపై స్పందించిన ఆమె కేరళలో శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. సొంత కారులో వెళ్తున్న సినీ నటిని కిడ్నాప్ చేయడం దారుణమని అన్నారు. ఈ దాష్టీకానికి పాల్పడిన దుండగులను పట్టుకోకుండా మీనమేషాలు లెక్కించడం సరికాదని, శాంతిభద్రతలు పరిరక్షించడంలో పినరయి విజయన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు.
కేరళలో క్రిమినల్ గ్యాంగులు రాజ్యమేలుతున్నాయని, చిన్నపిల్లలు, జంతువులను కిడ్నాప్ చేసి చంపేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజకీయ నాయకుల అండతో నేరగాళ్లు తప్పించుకుంటున్నారని ఆమె తెలిపారు. కాగా, కేరళ డీజీపీ లోక్ నాథ్ బెహరాకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. సీని నటి భావన కిడ్నాప్ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.