: దూసుకుపోతున్న ‘చంద్రన్న బాట’!
ఏపీలో చేపట్టిన ‘చంద్రన్న బాట’ కార్యక్రమం దూసుకుపోతోంది. ఈ కార్యక్రమం కింద చేపడుతున్న వాడవాడలా సిమెంట్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నానికి 4,119 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణాలు పూర్తి చేసింది. ‘చంద్రన్న బాట’ పనులు ముందుకు సాగేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5,170 కిలోమీటర్లు పైబడి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలనేది ప్రభుత్వం లక్ష్యంగా ఉంది.
ఇందుకుగాను, రూ.2000 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటివరకూ ఏపీలోని 13 జిల్లాల్లోని పదమూడు వేల పంచాయతీల్లో 4,119 కిలోమీటర్ల పైబడి రోడ్లు నిర్మించారు. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో అధికంగా సిమెంట్ రోడ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. పదమూడు జిల్లాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాల్లో మూడు జిల్లాలు వంద శాతానికి చేరువగా నిలిచాయి. నెల్లూరు జిల్లాలో 99 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 97 శాతం, గుంటూరులో 95 శాతం మేర సిమెంట్ రహదారుల నిర్మాణాలు పూర్తి చేశారు. కాగా, 2015-16లో 3,043 కిలో మీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మించాలన్న లక్ష్యాన్ని అధిగమించారు.