: విషయాన్ని పవన్ దృష్టికి తెచ్చేందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాను!: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్ సంపత్
‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం నిర్మాత శరత్ మరార్ పైన, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ పైన ఆ చిత్రానికి సంబంధించి కృష్ణా ఏరియా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ మండిపడుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం కృష్ణా ఏరియా హక్కులను రూ.4.5 కోట్లకు తీసుకున్నానని, రూ.2 కోట్ల మేరకు తనకు నష్టం వచ్చిందని అన్నారు. ఆ తర్వాత, పవన్ కల్యాణ్ ని కలిసి ఈ విషయం చెప్పానని, నష్టం బారి నుంచి బయటపడేలా చేస్తానని, తన మేనేజర్ శ్రీనివాస్ తో టచ్ లో ఉండాలని పవన్ కల్యాణ్ తనకు చెప్పారని నాటి విషయాలను ప్రస్తావించారు.
అయితే, పవన్ కల్యాణ్ కొత్త చిత్రం ‘కాటమరాయుడు’ కృష్ణా ఏరియా హక్కులు తనకు ఇస్తానని హామీ ఇచ్చిన మేనేజర్ శ్రీనివాస్, ఇప్పుడు మాట మారుస్తున్నాడని, వేరే వాళ్లకి ఆ హక్కులు ఇచ్చారని సంపత్ వాపోయారు. అంతేకాకుండా, ఈ విషయమై ప్రెస్ మీట్ నిర్వహిస్తే, పరువు నష్టం దావా వేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారని ఆయన ఆరోపించారు. తనకు జరిగిన నష్టం విషయమై నిర్మాత శరత్ మరార్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని, మేనేజర్ శ్రీనివాస్ కు మెస్సేజ్ లు పెట్టినా ఎటువంటి రెస్పాన్స్ లేదని సంపత్ ఆరోపించారు. పవన్ కల్యాణ్ ను కలిసేందుకు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్తే, సినిమా సంగతులు ఇక్కడ మాట్లాడరంటూ కొందరు తనను తిప్పి పంపేశారని, ఈ తతంగం అంతా పవన్ కల్యాణ్ కు తెలియాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని సంపత్ తెలిపారు.