: చిదంబరంపై మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్య స్వామి
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం లక్ష్యంగా ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి బాంబు పేల్చారు. కార్తీ చిదంబరం అవకతవకలకు పాల్పడ్డారంటూ పలు ఆధారాలు మీడియాకు వెల్లడించారు. ఇందులో ఆయనకు సంబంధించిన 21 బ్యాంకు ఖాతాల వివరాలు ఉండడం విశేషం. చిదంబరం కుమారుడు కార్తీ కానీ, ఆయన పేరెంట్ కంపెనీలు కానీ ఈ ఖాతాలకు సంబంధించిన ఆదాయ వివరాల రిటర్న్ లు దాఖలు చేయలేదని ఆయన తెలిపారు.
ప్రధానంగా మొనాకో బార్క్లేస్ బ్యాంక్, కెనడాలోని బ్యాంక్ మెట్రో, సింగపూర్ లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఓసీబీసీ, కెనడాలోని హెచ్ఎస్బీసీ , ఫ్రాన్స్ లో డ్యాయిష్ బ్యాంక్, స్విట్జర్లాండ్ లో యూబీఎస్, కాలిఫోర్నియా లోని వెల్స్ ఫార్గో బ్యాంక్ లాంటి వివిధ విదేశీ బ్యాంకుల ఖాతాలను ఆయన బహిర్గతం చేశారు. ఈ ఖాతాలను గత కొన్నేళ్లుగా కార్తీ రహస్యంగా మెయింటైన్ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. వీటి వివరాలు గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో కూడా ఆయన పేర్కొనలేదని ఆయన తెలిపారు.
గత ఎనిమిది నెలలుగా ఆర్థికశాఖలోని సన్నిహితుల ద్వారా అధికారులపై ఒత్తిడి చేయడం ద్వారా ఆదాయపుపన్ను శాఖాధికారులు కార్తీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. దీనిపై ఫ్రిబ్రవరి 16న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశానని ఆయన వెల్లడించారు. అలాగే ఎయిర్ సెల్ మాక్సిస్ స్కాంపై మండిపడ్డ ఆయన, ఈ స్కాంలో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ ప్రమేయంపై సాక్ష్యాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. కొంత మంది బీజేపీ నేతలు అవినీతి నిరోధక చట్టాన్ని నీరుగారేలా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాను దీనిపై పోరాడుతానని ఆయన చెప్పారు. అలాగే దీనిపై సవరణలకు పార్లమెంటులో ప్రతిపాదిస్తానని ఆయన తెలిపారు.