: హింస చెలరేగే అవకాశం ఉంది: కోదండరాం ర్యాలీపై పోలీసులు
తెలంగాణ ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వోద్యోగాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, దానికి నిరసిస్తూ ఈ నెల22న హైదరాబాద్‌లో నిరుద్యోగుల భారీ ర్యాలీ నిర్వహిస్తామని టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై డీసీపీ జోయెల్ డెవిస్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ శివారులో ర్యాలీకి అనుమతిస్తామని చెప్పారు. గతంలో టీజేఏసీ నగరంలో నిర్వహించిన ర్యాలీ వల్ల పలు చోట్ల విధ్వంసం జరిగిందని అన్నారు. అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని అన్నారు. అంతేగాక, తీవ్రవాద గ్రూపులు నిరసనకు మద్దతు ఇస్తున్నట్లు తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తీవ్ర స్థాయిలో హింస చెలరేగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అంతేగాక, నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు.
మరోవైపు టీజేఏసీ నేతలను పోలీసులు కలిసి పలు సూచనలు చేశారు. ఆ ర్యాలీని ఇందిరాపార్కు వద్ద కాకుండా శంషాబాద్‌లోని ఎస్ఎస్ కన్వెన్షన్ మైదానం, నాగోల్ మెట్రో రైల్ వద్ద మైదానం, చేర్యాల గ్రామంలోని మైదానం, గండిపేటలోని వాలంతరి మైదానాలతో పాటు మియాపూర్ వద్ద మైదానం, అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మైదానాల్లో ఎక్కడో ఒకచోట ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు.