: ‘గుజరాత్ గాడిదలు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కొనసాగుతున్న ప్రచార సభల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రోజు ప్రచారసభలో పాల్గొన్న ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ యాదవ్.. గుజరాత్ గాడిదలకు ప్రచారం ఆపేయండంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు సూచించారు. గుజరాత్ అటవీ జంతు సంపదకు సంబంధించి గుజరాత్ పర్యాటక శాఖ అమితాబ్ బచ్చన్‌ను ప్రచారకర్తగా ఉపయోగించుకుంటూ పలు యాడ్స్ రూపొందించింది. ఆ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని వన్య మృగ ప్రాణుల సంరక్షణ, ఆ ప్రాంత పర్యాటనకు ఆహ్వానిస్తూ బిగ్ బీ అందులో కనపడతారు.
ఆ యాడ్స్‌లోని జంతువుల్లో గాడిదలు కూడా ఉన్నాయి. అయితే, అఖిలేష్ మాట్లాడుతూ.. గుజరాత్ గాడిదల కోసం ఓ వాణిజ్య ప్రకటన ఉందని, ఆ ప్రకటనలో నటించిన గొప్ప బాలీవుడ్ నటుడుకి తానొక విన్నపం చేసుకుంటున్నానని అఖిలేష్ పేర్కొన్నారు. ఆ రాష్ట్ర గాడిదలకు ప్రచారం కల్పించకండని ఆయన డబుల్ మీనింగ్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ సమాజ్‌వాది పార్టీలో సభ్యురాలన్న విషయం తెలిసిందే.