: కోదండరాం నిర్వహించనున్న ర్యాలీపై మండిపడ్డ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
నిరుద్యోగుల భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కోదండరాం విద్యార్థులకు, నిరుద్యోగులకు మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. ఆయన తన వైఖరిని మార్చుకోవాలని రాజేశ్వర్‌రెడ్డి సలహా ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలోనూ దృష్టి పెట్టిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని పార్టీలన్నీ ఇప్పుడు కోదండరాంకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న వారు కూడా కోదండరాంతో కలిశారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
విద్యార్థులు తెలివైన వారని, వారి మాటలను నమ్మబోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయని, వాటికి విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారు చాలా సంతోషంగా ఉన్నారని రాజేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించవద్దని కోదండరాంని కోరుతున్నానని ఆయన అన్నారు.