: ఆ బొమ్మలన్నింటినీ వెంటనే పడేయండి.. లేదంటే చర్యలే: ప్రజలకు జర్మనీ ప్రభుత్వం ఆదేశం
చిన్నారులు బొమ్మలను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏడుపులంకించుకున్న చిన్నారులకు ఓ బొమ్మ ఇస్తే చాలు నవ్వుతూ స్వీకరిస్తారు. అదే బొమ్మను లాక్కుంటే ఆపకుండా మళ్లీ అరిచేస్తారు. అయితే, జర్మనీ దేశ ప్రభుత్వం మాత్రం పిల్లలకి కొనిచ్చిన బొమ్మలను వెంటనే దూరంగా పడేయాలని, అంతేగాక ఇకపై బొమ్మలు కొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. దానికి పెద్ద కారణమే ఉంది లెండి. ఆ దేశంలో చెక్క, ప్లాస్టిక్ బొమ్మలు కాకుండా స్మార్ట్, డిజిటల్ బొమ్మలనే ఉపయోగిస్తున్నారు. ఆ బొమ్మలు యాప్ ద్వారా పనిస్తూ మనుషులతో మాట్లాడతాయి. అయితే సైబర్ నేరగాళ్లు ఈ అంశాన్నే ఆసరాగా తీసుకొని బొమ్మలను కూడా హ్యాక్ చేస్తున్నారట.
చిన్నారుల కదలికలను, మాటల్ని గమనిస్తున్నారట. ప్రధానంగా అమెరికా నుంచి ఆ దేశానికి దిగుమతి అవుతున్న ‘మై ఫ్రెండ్ కేలా’ అనే బొమ్మను చాలా సాంకేతికతో తయారు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా యూరప్ దేశాల్లో అమ్ముడుపోతున్నాయి. ఈ బొమ్మను మనం ఏం ప్రశ్న అడిగినా ఇంటర్నెట్ సాయంతో జవాబు ఇచ్చేస్తుంది. ఈ బొమ్మలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి పసివారితో బొమ్మద్వారా మాట్లాడుతున్నారట. చిన్నారుల కదలికలతో పాటు ఇంట్లో పెద్దలు మాట్లాడుకునే మాటల్ని వింటున్నారట. దీంతో దీనిపై తీవ్రంగా స్పందించిన జర్మనీ ప్రభుత్వం వాటిని ప్రజలు ఉపయోగించకూడదని, వ్యాపారస్థులు ఇకపై అమ్మకూడదని, తమ ఆదేశాలను పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది.