: జియో దెబ్బకు 'అబ్బా' అంటున్న ఎయిర్ టెల్, ఐడియా!
ఉచిత కాల్స్, డేటాను ఇస్తామంటూ మార్కెట్లోకి వచ్చి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో దెబ్బకు టెలికం దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు వరుసగా రెండో త్రైమాసికంలోనూ కుదేలవనున్నాయి. అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో గండి పడిన ఈ సంస్థల ఆదాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ తగ్గిందని టెలికం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. జియో ఉచిత ఆఫర్లు కొనసాగినంత కాలం, ఈ కంపెనీల మార్జిన్లలో భారీ కోత తప్పదని హెచ్చరించారు.
జియో తన ఉచిత ఆఫర్లను నిలిపి, డేటా సర్వీసులపై డబ్బు వసూలు ప్రారంభిస్తేనే ఐడియా, ఎయిర్ టెల్ లు నిలదొక్కుకుంటాయని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా టెలికం నిపుణురాలు అర్పితా అగర్వాల్ అంచనా వేశారు. ఉచిత ఆఫర్లను జియో, మార్చి వరకూ పొడిగించడంతో టెల్కోల ఆదాయం భారీగా పడిపోయిందని అన్నారు.
కాగా, భారతీ ఎయిర్ టెల్ ఆదాయం 55 శాతం మేరకు తగ్గినట్టు తెలుస్తోంది. ఇక ఐడియా రూ. 478 కోట్లను, ఆర్ కామ్ రూ. 531 కోట్ల నష్టాలను ఇప్పటికే నమోదు చేశాయి. ఇదిలావుండగా, జియో అనైతిక ఆఫర్లు, దోపిడీ ధరల విధానంతో తాము నష్టపోతున్నామని ఈ సంస్థలు డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం), ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ)ల వద్ద ఇప్పటికే తమ ఫిర్యాదులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.