: బుల్ ఫైట్ లో బాంబు పేలుడు... రక్తమోడిన ప్రాంగణం


బుల్ ఫైట్ సందర్భంగా ఓ బాంబు పేలుడు సంభవించడంతో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 24 మంది పోలీసు అధికారులు, ఇద్దరు సామాన్యులు ఉన్నారు. ఈ ఘటన కొలంబియాలోని బొగోటా బుల్ రింగ్ వద్ద జరిగింది. ఈ సీజన్ లో చివరి బుల్ ఫైట్ ప్రారంభం కావడానికి కాసేపటి ముందు ఈ పేలుడు సంభవించింది. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఈ పేలుడు ఘటనలో ఓ పోలీసు అధికారి చనిపోయాడని తొలుత వార్తలు వచ్చాయి. అయితే బొగోటా మేయర్ ఎన్రిక్ పెనాలోసా మాట్లాడుతూ, ఈ వార్తలను ఖండించారు. మరోవైపు అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని ట్వీట్ చేశారు. పోలీసులపై జరిగే దాడులను ప్రభుత్వం క్షమించదని చెప్పారు.

ఈఎల్ఎన్ గెరిల్లా సంస్థనే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి, 2012లో వామపక్ష పార్టీకి చెందిన మాజీ మేయర్ గుస్తావో పెట్రో బుల్ ఫైట్ ను నిషేధించారు. అయితే, గత జనవరి 22న కాన్స్టిట్యూషనల్ కోర్టు బుల్ ఫైట్ పై నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ క్రమంలో జంతు హక్కుల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో హింస కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలోనే, ఈ బాంబు పేలుడు జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News