: ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీ కొని ఒకరికి గాయాలు!
ఏపీ అటవీ శాఖా మంత్రి, టీడీపీ సీనియర్ బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఎస్ ఆర్ పురంలో పుల్లూరు క్రాస్ వద్ద నిన్న రాత్రి జరిగింది. చిత్తూరు నుంచి వస్తున్న మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహనం పుల్లూరు క్రాస్ వద్దకు రాగానే యూఎం పురం నుంచి ద్విచక్ర వాహనంలో వస్తున్న దొరబాబు (26)ను ఢీ కొట్టింది. దీంతో, కింద పడిపోయిన దొరబాబుకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఎస్ఆర్ పురం పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి వారు వెళ్లారు. క్షతగాత్రుడు దొరబాబును చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.