: పళనికి అప్పుడే కష్టాలు... బల నిరూపణ చెల్లదంటున్న నిపుణులు!
రెండు రోజుల నాడు తీవ్ర ఉద్రిక్తత, ఆందోళన మధ్య తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పళనిస్వామి బల నిరూపణ చెల్లదని, కోర్టుకు వెళితే అది రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ తరువాత అత్యధిక ఎమ్మెల్యేలున్న డీఎంకే, రహస్య ఓటింగ్ జరపాలన్న డిమాండ్ ను తెరపైకి తేగా, దాన్ని స్పీకర్ ధనపాల్ పట్టించుకోలేదని తమిళ అసెంబ్లీ మాజీ స్పీకర్లు సేడపట్టి ముత్తయ్య, ఆవుడయప్పన్ విమర్శించారు. సభలో జరిగిన ఘటనలు నియమాలకు వ్యతిరేకమేనని, స్పీకర్ పక్షపాతంగా వ్యవహరించారని అన్నారు.
కువత్తూరులో ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారో అసెంబ్లీలోనూ అలానే ఉన్నారని, అంతమాత్రాన రిసార్టులోనే బల నిరూపణ పూర్తి చేయాల్సిందని ముత్తయ్య ఎద్దేవా చేశారు. బలపరీక్షను రద్దు చేసి, అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన, అధికార పక్షానికి వెన్నుదన్నుగా స్పీకర్ నిలవడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని అన్నారు. ఈ పరీక్ష చట్ట విరుద్ధమని, స్పీకర్ తీర్పును కోర్టులో సవాల్ చేస్తే, అది రద్దయ్యే అవకాశాలే అధికమని మాజీ ఉప సభాపతి వీపీ దురైసామి వ్యాఖ్యానించారు. స్పీకర్ సభలో లేని వేళ, మార్షల్స్ ఎలా లోపలికి రాగలిగారని ఆయన ప్రశ్నించారు.