: ఆ వార్త చదివి ఏడ్చేశాను.. !: కేసీఆర్
నేత కార్మికుల సమస్యలపై ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఉద్యమ సమయంలో జరిగిన ఓ ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చేనేత కార్మికుల దీనావస్థను చూసి రెండుసార్లు తన కళ్లవెంట నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. ‘‘అప్పుడు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నా. ఓరోజు పేపర్ తిరగేస్తున్న నాకు 11 మంది చేనేత కార్మికుల మృతి అనే వార్త కనిపించింది. అది చూసి నా మనసు వికలమైంది. ఏడ్చినంత పనైంది. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఎంతో పేరుంది. అటువంటి వారు తిండిలేక మరణించడం బాధనిపించింది’’ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
దీంతో కాసేపు అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది. ఆ తర్వాత తాను టీఆర్ఎస్ తరపున రూ.50 లక్షలు సిరిసిల్లకు పంపానని, అవసరమున్న వారికి అక్కడి సొసైటీ డబ్బులు పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ఇంకోసారి పోచంపల్లిలోనూ ఇటువంటి ఘటనే జరిగిందన్నారు. ఏడుగురు కార్మికులు చనిపోయారని, పరిహారం కోసం డిమాండ్ చేస్తే అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని కేసీఆర్ తెలిపారు. దీంతో తానే స్వయంగా భిక్షాటన చేసి రూ.4 లక్షలు వారికి అందించినట్టు చెప్పారు. ఇకముందు అటువంటి బాధలు రాష్ట్రంలో ఉండకూడదనేదే తన అభిమతమని కేసీఆర్ పేర్కొన్నారు.