: నోట్ల రద్దును కేసీఆర్ ముందు వ్యతిరేకించి.. తర్వాత పొగిడారు.. ఏం జరిగిందో..!: దిగ్విజయ్ సింగ్ ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ విరుచుకుపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన ‘జన ఆవేదన’ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తొలుత వ్యతిరేకించిన కేసీఆర్ ఆ తర్వాత ప్రశంసించడం వెనక ఉన్న మర్మమేమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. నోట్ల రద్దుతో సామాన్యులు ఇబ్బందులు పడితే బ్యాంకు మేనేజర్లు నేరుగా బడాబాబుల ఇళ్లకు వెళ్లి నోట్ల కట్టలు అందించారని ఆరోపించారు. మోదీ తన నిర్ణయంతో పేటీఎం, వీసా, మాస్టర్‌కార్డుల యాజమాన్యాలకు ప్రయోజనం కలిగించారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలను రెచ్చగొట్టి వారి ఓట్లలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఎంఐఎంను నమ్మొద్దని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.