: అప్పుడే సెగలు పుట్టిస్తున్న భానుడు.. ఒక్క రోజులోనే 2.6 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత
భానుడు అప్పుడే మొదలెట్టేశాడు. ఒళ్లు సుర్రుమనిపిస్తున్నాడు. శివరాత్రి అయినా రాకముందే సెగలు పుట్టిస్తున్నాడు. దీంతో మున్ముందు పరిస్థితి ఏంటో తెలియక ఇప్పటి నుంచే భయపడుతున్నారు. హైదరాబాద్‌లో ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. ఆదివారం నగరంలో ఏకంగా 35.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. శనివారం 33.2 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రత ఒక్క రోజులోనే ఏకంగా 2.6 డిగ్రీలు పెరగడం భవిష్యత్ ఎండలకు సంకేతంగా కనబడుతోంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్నమొన్నటి వరకు చలితో అల్లాడిపోయిన ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.