: మన క్రికెటర్లు.. వారి చదువులు!
మైదానంలో తమ బ్యాట్ సత్తాను చాటుతూ టీమిండియా క్రికెటర్లు ముందుకు దూసుకువెళ్తున్నారు. అయితే, స్టడీ విషయంలో వారు ఎంత వరకు సక్సెస్ అయ్యారనే ప్రశ్న వారి అభిమానుల్లో తలెత్తక మానదు. ఈ నేపథ్యంలో టీమిండియాకు చెందిన కొంత మంది క్రికెటర్ల విద్యార్హతలు ఇలా ఉన్నాయి.
* ఎంఎస్ ధోని... బీ.కామ్ చదివాడు. క్రికెటర్ గా ఓ స్థాయికి వచ్చాక, కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే ఉద్దేశంతో..ఒక వైపు కెప్టెన్ గా కొనసాగుతూనే, తన డిగ్రీని ధోనీ పూర్తి చేయడం విశేషం.
* విరాట్ కోహ్లీ... అతి కష్టం మీద పన్నెండో తరగతి పూర్తి చేశాడు. పదో తరగతి వరకు ఢిల్లీల్లోని విశాల్ భారతీ స్కూల్ లో కోహ్లి చదివాడు. ఆ తర్వాత, జేవియర్స్ పాఠశాలకు మారాడు. ‘జేవియర్స్’ లో క్రికెట్ క్రీడను ప్రోత్సహిస్తారనే కారణంగానే కోహ్లీ స్కూల్ మారాడట.
* రవి చంద్రన్ అశ్విన్.. టీమిండియా టాప్ స్పిన్నర్ అయిన అశ్విన్ తమిళనాడులోని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ లో పని చేశాడు. అశ్విన్ పాఠశాల విద్య చెన్నైలోని ప్రఖ్యాత పద్మ శేషాద్రి స్కూల్ లో జరిగింది.
* హార్దిక్ పాండ్యా.. ఎనిమిది పాసయ్యాడు. తొమ్మిదో తరగతి ఫెయిలయ్యాడు. చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న పాండ్యా, ఆటలో శిక్షణ కొనసాగించడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో తన చదువుపై ఆసక్తి చూపలేకపోయాడు.
* మురళీ విజయ్.. ఆట, చదువు రెండింటిలో ముందున్నాడు. ఎకనమిక్స్ లో డిగ్రీ పూర్తి చేయడమే కాకుండా, చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్శిటీ నుంచి ఫిలాసఫీలో పీజీ పూర్తి చేశాడు.
* రోహిత్ శర్మ.. టీమిండియా కు ఎంపిక కావడంతో శర్మ తన చదువు కొనసాగించలేకపోయాడు. ముంబైలోని రిజ్వీ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో శర్మకు టీమిండియాలో అవకాశం వచ్చింది. వరుస సిరీస్ లలో ఆడే అవకాశం రావడంతో కాలేజీకి వెళ్లడం శర్మకు కుదర్లేదు. దీంతో, అటెండెన్స్ సరిపోకపోవడంతో పరీక్షలు రాయలేకపోయిన శర్మ తన ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేయలేకపోయాడు.