: తమిళ సర్కారుకు, నేరస్తుల గుంపుకు తేడా లేదు: ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడులో ప్రస్తుతం ఏర్పాటైన ప్రభుత్వానికి, నేరస్తుల గుంపుకు పెద్దగా తేడాలు లేవని దక్షిణాది స్టార్ హీరో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, అసెంబ్లీలో వెల్లడైన ఫలితాన్ని తనతో సహా ప్రజలెవరూ అంగీకరించడం లేదని అన్నారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఎంచుకున్న శశికళ సహా ఆమె కుటుంబ సభ్యులు అవినీతి కేసులో దోషులుగా మిగిలారని గుర్తు చేస్తూ, నిజాన్ని కోర్టు తేల్చి చెప్పిందని, చనిపోయిన జయలలిత కూడా అక్రమాస్తుల కేసులో దోషేనని అన్నారు. తమిళనాడు అసెంబ్లీని మనమే శుద్ధి చేయాల్సి వుందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, ప్రజల మనసులో ఏముందో తెలుస్తుందని చెప్పారు. ఇక తన రాజకీయ అరంగేట్రంపై స్పందిస్తూ, తనకు కోపం ఎక్కువని, అందువల్ల రాజకీయాలకు పనికిరానని అన్నారు.