: ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ పై రాళ్ల దాడి!
సమాజ్ వాదీ పార్టీ నేత, ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ పై ఈ ఉదయం రాళ్లదాడి జరిగింది. ఆయన తన కారులో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ ఘటన యాదవులు అత్యధికంగా ఉండే ఎత్వా జిల్లా జస్వంత్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగింది. ఈ దాడిలో శివపాల్ కు ఏవైనా గాయాలు అయ్యాయా? అన్న విషయం తెలియరాలేదు. అక్కడికి సమీపంలోనే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, ఆయన కారును పంపించారు. కాగా, నేడు యూపీలోని 12 జిల్లాల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శివపాల్ పై దాడి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.