: తమిళనాడులో అసలేం జరిగిందంటే... ప్రత్యేక బుక్ లెట్ ను విడుదల చేయనున్న విద్యాసాగర్ రావు
జయలలిత తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినంత వరకూ తమిళనాడులో జరిగిన విషయాలపై గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రత్యేక బుక్ లెట్ ను విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి ఈ నెల 16 వరకూ జరిగిన మార్పులతో ఈ బుక్ లెట్ ఉంటుందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ పలు అంశాలను ఇందులో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. కాగా, జయలలిత మరణించిన తరువాత, గవర్నర్ వ్యవహార శైలిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నివృత్తి చేసేలా విద్యాసాగర్ స్వయంగా ఈ బుక్ లెట్ ను తయారు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. శశికళపై తానెందుకు తటస్థంగా ఉండాల్సి వచ్చిందో ఈ పుస్తకంలో ఆయన తెలియజేస్తారని రాజ్ భవన్ అధికారులు చెబుతున్నారు.